వెట్టిచాకిరీ నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించాలి

26-10-2026 | 07:19pm

‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్,(విజయక్రాంతి): సమాజంలో వెట్టిచాకిరీని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు(MLA K.R. Nagaraju) పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో ‘మీ పని, మీ జీవితం, మీ స్వేచ్ఛ’ గోడపత్రికను ఆవిష్కరించడంతో పాటు ‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(Collector Dr. Satya Sharada), మేర కార్పొరేషన్ చైర్మన్ వెంకట్రాజం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్‌లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ. వ్యవసాయం, ఇటుక బట్టీలు, ఆక్వాకల్చర్, గనులు, క్వారీలు వంటి అసంఘటిత రంగాల్లో వెట్టిచాకిరీ జరిగే అవకాశాలు ఉన్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండి బాధితులను గుర్తించాలని సూచించారు. ముందస్తు అడ్వాన్సులు, అప్పుల పేరుతో వేతనాలు నిలిపివేస్తూ,బెదిరింపులు-మోసాల ద్వారా కార్మికులను బంధించే పరిస్థితులపై అధికారులు నిఘా ఉంచి న్యాయం చేయాలన్నారు. హక్కులపై అవగాహన లేకపోవడం, యజమానుల ప్రతీకార భయంతో చాలామంది ఫిర్యాదు చేయలేకపోతున్నారని, వారిలో ధైర్యాన్ని నింపేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కార్మికులు తమ హక్కులను తెలుసుకొని, ఎక్కడైనా వెట్టిచాకిరీ గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

టోల్‌ఫ్రీ నంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ. వెట్టిచాకిరీ అనేది కార్మికుల స్వేచ్ఛను, హక్కులను కాలరాసే తీవ్రమైన దోపిడీ అని పేర్కొన్నారు. బాధితులు ఫిర్యాదు చేసేందుకు అందుబాటులో ఉన్న బాండెడ్ లేబర్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 080-69434343 గురించి విస్తృత ప్రచారం చేయడమే ఈ రథం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ ప్రచార రథం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వెట్టిచాకిరీని గుర్తించడం, ఫిర్యాదు చేసే విధానం ప్రభుత్వ సాయంపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు.

అనంతరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ భార్గవ్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. వెట్టిచాకిరీ బాధితులను గుర్తించి, రక్షించి, పునరావాసం కల్పిస్తామని అధికారులు ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, కార్మిక, పోలీస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ జిల్లా న్యాయ సేవల సంస్థ మహిళా-శిశు సంక్షేమ, తదితర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు