ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

26-10-2026 | 08:15pm

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత అధికారులదే

కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పష్టీకరణ

కలెక్టరేట్‌లో 153 అర్జీల స్వీకరణ. వృద్ధుడికి దుస్తుల అందజేత

వరంగల్, అక్టోబర్ 26 (విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద(Collector Satyasharada) ఆదేశించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై మొత్తం 153 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ శాఖకు 55, బడా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 24, హౌసింగ్ శాఖకు 11, డీఆర్‌డీఏకు 8 రాగా, ఇతర శాఖలకు సంబంధించి మరొక 55 దరఖాస్తులు అందాయి. బాధితులు అందించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ తేల్చి చెప్పారు.

కలెక్టర్ మానవత్వం..

ప్రజావాణిలో వృద్ధుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. వృద్ధులు సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. కాగా, కలెక్టరేట్‌కు వచ్చిన ఓ వృద్ధుడి పరిస్థితిని గమనించిన కలెక్టర్ డాక్టర్ సత్యశారద మానవత్వంతో స్పందించారు. ఆ వృద్ధుడికి టీషర్ట్, జూట్ బ్యాగ్ అందించి ఆప్యాయత చాటుకోవడంతో పాటు ఆయన సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారికి అర్జీని ఎండార్స్ చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్.కిషోర్ కుమార్ (రెవెన్యూ), వై.వి.గణేష్ (స్థానిక సంస్థలు), జడ్పీ సీఈఓ వసంత, హౌసింగ్ పీడీ విష్ణువర్ధన్ రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజిరెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ విశ్వప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు