రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
జిల్లా అధ్యక్షుడు వంగరి నాగరాజు, ప్రధాన కార్యదర్శి అజీజ్
గజ్వేల్: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లకు(Telangana Ration Dealers) గతంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిద్దిపేట జిల్లా(Siddipet district) రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వంగరి నాగరాజు, ప్రధాన కార్యదర్శి అజీజ్ డిమాండ్ చేశారు. సోమవారం గజ్వేల్లో సంఘం నాయకులతో సమావేశమైన వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో(Congress Party Manifesto)లో పేర్కొన్న నెలకు రూ.5 వేల గౌరవ వేతనాన్ని అమలు చేయాలని కోరారు. గత 60 ఏళ్లుగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యలపై చర్చించేందుకు మంగళవారం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ బింగి ఎల్లయ్య ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్న ఈ సభను రేషన్ డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు తాడూరు లక్ష్మణ్, చెక్కల రమేష్, బాల్ నరసయ్య, ములుగు చంద్రం, గుజ్జ వెంకటేశం, షరీఫ్, నంద కిషోర్, నర్సింలు, శేఖర్, వీరేశం, రాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.