భూసార పరిరక్షణతో అధిక దిగుబడులు
రైతులకు అవగాహన కల్పించిన కేవీకే శాస్త్రవేత్త
చివ్వెంల: భూసారాన్ని కాపాడుకుంటూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు సాధించాలని కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త డి. ఆదర్శ్ రైతులకు సూచించారు. చివ్వెంల మండలం దురాజ్‌పల్లి క్లస్టర్ పరిధిలోని తిరుమలగిరి రైతు వేదికలో ‘ఖేత్ బచావో అభియాన్’లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని, సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట పంటల సాగుతో భూసారం, నేలలో తేమ నిల్వ సామర్థ్యం పెరుగుతాయని వివరించారు. ఒకే పంటను వరుసగా సాగు చేయకుండా పంట మార్పిడి, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారి డి. మానస, సర్పంచ్ కె. లింగయ్య, మార్కెట్ డైరెక్టర్ నరసింహ చారి, ఆయిల్‌ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ వి. లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి కవితతో పాటు రైతులు పాల్గొన్నారు.