కృష్ణానదిపై నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన అధికారులు

12-09-2026 | 07:05pm

మఠంపల్లి సెప్టెంబర్ 12(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కృష్ణానదిపై మట్టపల్లి బ్రిడ్జి(Mattapalli Bridge) వద్ద సెప్టెంబర్ 14 నుండి 25 వరకు జరగనున్న వినాయక నిమజ్జనం నేపథ్యంలో శనివారం హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గజ్జె చరమంద రాజు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. అన్ని శాఖల అధికారులతో కలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ మట్టపల్లి బ్రిడ్జి వద్ద గల నిమజ్జన ఘాట్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జనం సాఫీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.నిమజ్జన ప్రదేశంలో భారీ లైటింగ్,క్రేన్లు,గజ ఈతగాళ్లు, అంబులెన్స్,నదిలో ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ నెట్లు, బారికేడ్లు,

భక్తుల కోసం త్రాగునీరు, పారిశుధ్యం ట్రాఫిక్ క్లియరెన్స్ వంటి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.నిమజ్జనం సాఫీగా జరిగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎన్సీఎల్ ఫ్యాక్టరీ, సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలకు సీఐ విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో ఎమ్మార్వో హిమబిందు, ఎంపీడీవో సుమంత్ రెడ్డి,ఎస్సై ప్రవీణ్ కుమార్,ట్రాన్స్ కో ఏఈ హరిష్ రెడ్డి,పంచాయతీరాజ్ ఏఈ,ఫైర్ ఆఫీసర్,స్థానిక సర్పంచ్ విజయశాంతి అప్పారావు,కార్యదర్శులు, ఎన్సీఎల్ ఫ్యాక్టరీ ప్రతినిధులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు