నిధుల దుర్వినియోగంపై పంచాయతీ కార్యదర్శి
జగిత్యాల, నవంబర్ 23 ( విజయ క్రాంతి ): జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండల కేంద్రంతో(Medipalli Mandal Center) పాటు సారంగాపూర్ మండలంలోని సంబంధిత గ్రామపంచాయతీలలో గతంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన రామడుగు సంతోష్ రావు హయాంలో ప్రభుత్వ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల నిర్వహణ, నిర్మాణ పనులు, పారిశుద్ధ్య పనులు తదితర అంశాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ మెట్టు ప్రకాష్ జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల నాణ్యత, పనుల నిర్మాణ అంచనాలు, ఖర్చుల వివరాలు, బిల్లులు, ఇతర ఆర్థిక లావాదేవీలపై సమగ్రంగా పరిశీలన జరపాలని ఫిర్యాదులో కోరారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు వాస్తవంగా పూర్తయ్యాయా. పనులకు కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించారా. అవకతవకలు జరిగాయా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి నష్టం వాటిల్లిందా అనే అంశాలపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే పనులకు సంబంధించిన బిల్లులు, వోచర్లు, చెక్కులు, చెల్లింపు రసీదులు, పంచాయతీ రికార్డులు, బ్యాంకు లావాదేవీలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డుల్లో ఉన్న వివరాలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య వ్యత్యాసాలున్నాయా అనే విషయాన్ని నిర్ధారించాలని పేర్కొన్నారు. ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, విచారణలో అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు మెట్టు ప్రకాష్ జిల్లా కలెక్టర్‌ను కోరారు.