గుర్తింపు కార్మిక సంఘాల గడువు ముగిసినందున అన్ని సంఘాలతో చర్చించాలి

13-09-2026 | 12:54am

ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి: హెచ్ఎంఎస్

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): సింగరేణి(Singareni)లో గుర్తింపు కార్మిక సంఘాల గడువు పూర్తయినందున ఇకనుండి సింగరేణి యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలతో సమస్యలపై చర్చించాలని హెచ్ఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణి భూపాలపల్లి ఏరియా(Singareni Bhupalapally Area)లోని కేటీకే 6వ ఇంక్లైన్ గనిలో హెచ్ఎంఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ నరేష్ నేత అధ్యక్షతన బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించగా హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ, జేబిసీసీఐ సభ్యులు రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మె పేరుతో యాజమాన్యం దిగి వచ్చిందని చారిత్రకమైన అగ్రిమెంట్లు చేశామని తప్పుడు ప్రచారం చేసి కార్మికులను మరొకసారి మోసం చేయడానికి కుట్ర చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల మాటలను నమ్మవద్దని సూచించారు. 

అనంతరం ఏరియా ఆసుపత్రిని బ్రాంచ్ నాయకులు సాగర్ ఆధ్వర్యంలో సందర్శించారు. లీడర్లకు, అధికారులకు ఒక రకంగా, కార్మికుల పట్ల అలసత్వం వ్యవహరించడం జరుగుతుందని ఆరోపించారు. అందరికి సమానంగా మెరుగైన వైద్యం, మందులు మిగతా ట్రీట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కావలసిన మందులు ఎప్పటికప్పుడు తెప్పించకుండా కార్మికులను ఆసుపత్రి చుట్టూ తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కంపెనీకి నష్టం లేకుండా నర్సింగ్ స్టాప్ ను నర్సింగ్ ఆఫీసర్ గా  పేరు మార్చాలని కోరారు. పారా మెడికల్ సిబ్బందికి డ్రెస్ క్లాత్ ఇవ్వడం లేదు, వెంటనే ఇవ్వాలని, డ్రెస్ చేంజింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని, సిబ్బందికి క్యాంటీన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు