కార్తీక వన సమారాధనలు ఆధ్యాత్మికత, ఆత్మీయతకు ప్రతీకలు
రాయపూడి ఆర్య వైశ్య మిత్ర మండలి అధ్యాత్మిక కార్య క్రమాలు అభినందనీయం
ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్
కోదాడ నవంబర్ 22 ,(విజయక్రాంతి): కార్తీక మాస వన సమారాధనలు ఆధ్యాత్మికతకు, ఆత్మీయ అనురాగాలకు, ఆరోగ్యానికి, సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి ఉత్తమ్(Kodad MLA Nalamada Padmavathi Uttam) అన్నారు. ఆదివారం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కోదాడ పట్టణంలో రాయపూడి మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వన సమారాధన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వనభోజనాల కార్యక్రమాలు కుటుంబాల మధ్య అనుబంధాలను బలోపేతం చేయడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావం, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
రాయపూడి మిత్రమండలి ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. నియోజకవర్గ ప్రజలందరికీ కార్తీక మాస పుణ్యఫలాలు సిద్ధించాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు రాయపూడి వెంకటనారాయణ, ఓరుగంటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ వన సమారాధనకు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేసిన కోదాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు, పెద్దలకు, యువతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి, సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ నివేదిత, రామారావు, కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు, ఆర్యవైశ్య నాయకులు రాయపూడి వెంకటనారాయణ, ఓరుగంటి ప్రభాకర్, బండారు శ్రీనివాస్, సిహెచ్ హనుమంతరావు, కరుణాకర్ , బండారు శ్రీనివాసరావు, అశోక్,, సైదారావు,పబ్బా గీత తదితరులు పాల్గొన్నారు.