గ్యాస్ సిలిండర్లో నీళ్లు
తమ తప్పు కాదంటున్న ఏజెన్సీ నిర్వాహకులు
తమకు సరఫరా అయిన సిలిండర్లనే విక్రయిస్తామని వెల్లడి
జుక్కల్, నవంబర్ 22 (విజయక్రాంతి): జుక్కల్ మండల కేంద్రంలోని ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ(Indane gas Agency)లో గ్యాస్ సిలిండర్లో నీరు ఉన్నట్లు గుర్తించామని పెద్ద గుల్ల తండాకు చెందిన అనిల్ ఆరోపించారు. ఈ నెల 10వ తేదీన ఏజెన్సీ నుంచి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే కొన్ని రోజులకే గ్యాస్ అయిపోయినట్లు అనిపించడంతో సిలిండర్ను పరిశీలించగా లోపల నుంచి నీటి శబ్దం వినిపించిందని పేర్కొన్నారు. సిలిండర్ను వంచి చూడగా అందులో నుంచి నీరు బయటకు వచ్చిందని అనిల్ తెలిపారు.
సాధారణంగా గ్యాస్ వినియోగం పూర్తికాకముందే సిలిండర్ ఖాళీ అయినట్లు అనిపించడంతో అనుమానం వచ్చిందని, పరిశీలించిన తర్వాత నీరు ఉన్న విషయం బయటపడిందని చెప్పారు. గ్యాస్ సిలిండర్లో నీరు ఎలా చేరిందనే విషయంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు. ఈ ఘటనపై సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు, గ్యాస్ కంపెనీ ప్రతినిధులు స్పందించి సిలిండర్ను పరిశీలించాలని వినియోగదారులు కోరుతున్నారు.
సిలిండర్లలో నీరు లేదా ఇతర పదార్థాలు ఉన్నాయా అనే అంశంపై తనిఖీలు నిర్వహిస్తే వాస్తవ పరిస్థితి వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో తమ ఏజెన్సీ తప్పు లేదని నిర్వాహకులు స్పష్టం చేసినట్లు సమాచారం. తమకు కంపెనీ నుంచి సరఫరా అయ్యే సిలిండర్లనే వినియోగదారులకు విక్రయిస్తున్నామని, సిలిండర్లలో నీరు ఉన్న విషయం తమకు తెలియదని వారు తెలిపారు. సిలిండర్లు కంపెనీ నుంచి ఏ విధంగా సరఫరా అవుతున్నాయో అదే విధంగా వినియోగదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. సిలిండర్లో నీరు ఉన్నట్లు వినియోగదారు చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులు సిలిండర్ను స్వాధీనం చేసుకుని సాంకేతికంగా పరిశీలించి, నీరు ఎలా చేరిందనే విషయాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. వినియోగదారుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో అధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.