బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (Low Pressure) ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. నవంబర్ 30 ప్రాంతంలో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడన వ్యవస్థ అభివృద్ధి చెందవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) దీర్ఘకాలిక అంచనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ వ్యవస్థ తుఫానుగా (Cyclone) మారుతుందా? ఏ దిశగా ప్రయాణిస్తుంది? తెలుగు రాష్ట్రాలకు వర్షాలు తెస్తుందా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
నవంబర్ 22న విడుదల చేసిన ఐఎండీ అధికారిక ఉష్ణమండల వాతావరణ నివేదిక (Tropical Weather Outlook) ప్రకారం, తదుపరి 168 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు లేవు. అయితే నవంబర్ 30 నాటికి అల్పపీడన వ్యవస్థ అభివృద్ధిపై మరిన్ని అంచనాలు వెలువడే అవకాశం ఉంది. దీని తీవ్రత, గమనం, ప్రభావంపై ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రావడం సాధ్యం కాదు.
ఇక తెలంగాణలో వాతావరణ పరిస్థితుల విషయానికి వస్తే.. నవంబర్ 22, 23 తేదీల్లో పొడి వాతావరణం (Dry Weather) కొనసాగనుంది. నవంబర్ 24 నుంచి 26 వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మరోవైపు డిసెంబర్ రెండో వారంలో ఇంకో అల్పపీడనం ఏర్పడవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. తాజా వాతావరణ బులెటిన్లను (Weather Bulletin) బట్టి రాబోయే రోజుల్లో పరిస్థితులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.