అనుమతులు లేకుండా బోరుబావులు తవ్వితే కఠిన చర్యలు

22-11-2026 | 06:56pm

బోరుబండి యజమానులకు బోధన్ తహసీల్దార్ విఠల్ హెచ్చరిక

రూ.50 వేల జరిమానాతో పాటు బోరుబండి సీజ్

బోధన్, నవంబర్ 22 (విజయక్రాంతి): బోధన్ మండల(Bodhan Mandal) పరిధిలో సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా కొత్తగా బోరుబావుల తవ్వకాలు(Illegal Borewell Drilling) చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పి. విఠల్(Bodhan Tahsildar P. Vithal), ఎంపీడీవో కిషోర్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను(Government regulations) ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా బోర్లు వేసే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.

మండలంలో అనుమతులు లేకుండా బోరుబావుల తవ్వకాలు చేపట్టే బోరుబండి యజమానులకు రూ.50 వేల జరిమానా విధించడంతో పాటు, సంబంధిత బోరుబండిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. భూగర్భ జలాల పరిరక్షణ(Groundwater), నీటి వనరుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.

రైతులు, ప్రజలు బోరుబావుల తవ్వకాలకు ముందుగా సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా బోరుబావుల తవ్వకాలు చేపట్టే వారిపై అధికారులు నిఘా ఉంచుతారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ భూగర్భ జలాలను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తహసీల్దార్ విఠల్ కోరారు.

మరిన్ని వార్తలు