ఇందిరమ్మ ఇళ్లు.. అక్రమ వసూళ్లు!

19-10-2026 | 05:20am
  1. మంజూరికి మధ్యవర్తుల చేతివాటం?
  2. అర్హులకు అన్యాయం- అనర్హులకు అందలం                        
  3. ఒక్కో ఇంటికి రూ.20 వేల నుంచి- 50వేల వరకు అంటూ ఆరోపణలు
  4. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు వేడుకోలు

గరిడేపల్లి, అక్టోబరు 18 :  తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు మండలంలో కలకలం రేపుతున్నాయి. మండలంలోని మొత్తం 33 గ్రామపంచాయతీలు ఉండగా వాటిలోని చాలా గ్రామాల్లో ఇళ్ల మంజూరు పేరుతో కొందరు అక్రమ వసూళ్లు జరుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అర్హులకు అన్యాయం! 

పలు గ్రామాల్లో పైసలు ఇచ్చిన వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయనే విషయాలు వినిపిస్తున్నాయి .అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ విషయా న్ని ఎవరికి చెప్పాలో అర్థం కాక ఆ పార్టీ కి చెందిన కొందరు నిజాయితీ గల నాయకులు, అన్యాయం జరిగిన నిజమైన అర్హులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. కొంద రు స్వార్ధపరులు చేస్తున్న ఈ పనుల వల్ల అర్హులకు అన్యాయం జరగడంతోపాటు అన ర్హులు దర్జాగా నీళ్లు నేర్పించుకుంటున్నారని ప్రచారాలు గ్రామాలలో సాగుతున్నాయి.

ఒక్కో ఇంటికి రూ.20 వేల నుంచి  రూ.50 వేలు డిమాండ్?

గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.  అలాగే, ఇప్పటికే మంజూరైన ఇళ్ల బిల్లులు విడుదల కావాలంటే ముందుగానే డబ్బులు చెల్లించాలని కొందరు మధ్యవర్తులు అధికారుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని అభిప్రాయాలు గ్రామాలలో వ్యక్తమవుతున్నాయనే చర్చలు సాగుతున్నట్లు వినికిడి. ఈ అక్రమ వసూళ్ల పర్వం ఏదో ఒకటి రెండు గ్రామాల్లో కాకుండా మండలంలోని అనేక గ్రామాలలో కొనసాగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అధికారులు విచారణ జరపాలి

నిరుపేదలకు ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇళ్ల బిల్లుల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులపై ఉన్నతాధికారులు విచారణ  చేపట్టాలి. అప్పుడు ఆ ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి.  నిజమైన అర్హులకు ఈ ఇందిరమ్మ ఇల్లు మంజూరి అయినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లు. దీనికోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి.  ఈ సమస్యను మంత్రి దృష్టికి సైతం తీసుకువెళ్తాం.

 జోగు అరవింద రెడ్డి, వైస్ సర్పంచ్, పొనుగోడు

మా దృష్టికి రాలేదు..

ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు తీసుకుంటున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చి ఫిర్యాదు చేస్తే, సంబంధిత అధి కారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.                       

 సరోజ, ఎంపీడీవో, గరిడేపల్లి

మరిన్ని వార్తలు