మృతదేహం అప్పగించాలని కోరుతూ పోలీసులపై ఆగ్రహం

21-11-2026 | 11:09pm

నిన్న హత్య జరిగితే.. నేటికీ అంత్యక్రియలకు నోచుకోని మృతదేహం.

నా భర్త మృతదేహాన్ని అప్పగించండి అంటూ మృతుని భార్య కన్నీరుమున్నీరు.. కుటుంబ సభ్యుల ఆవేదన.

తుంగతుర్తి( విజయక్రాంతి) : తన భర్తను కోల్పోయిన బాధలో ఉన్న మృతుడి భార్య రేఖ.. కనీసం చివరిచూపు చూసుకుని అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని కన్నీరుమున్నీరవుతోంది. నా భర్త మృతదేహాన్ని మాకు అప్పగించండి.. అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం కల్పించండి అంటూ ఆమె వేడుకుంటున్న తీరు గ్రామస్తులను కలచివేస్తోంది.

అదే గ్రామానికి చెందిన రమణబోయిన మహేష్ కత్తితో పొడిచి చామకూరి మహేష్‌ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే మృతదేహాన్ని అప్పగించడంలో జరుగుతున్న జాప్యంపై కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై పోలీసుల వివరణ తెలియాల్సి ఉంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు అంత్యక్రియలకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? అని ప్రశ్నించారు.

ఒకవైపు కుటుంబ పెద్దను కోల్పోయిన దుఃఖం.. మరోవైపు మృతదేహం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఆ కుటుంబాన్ని మరింత కుంగదీస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మృతదేహం అప్పగింతపై స్పష్టత ఇవ్వాలని, చట్టపరమైన ప్రక్రియను త్వరగా పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

హత్య కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి ,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు