ఒవైసీపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

21-11-2026 | 06:31pm

హైదరాబాద్: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(AIMIM chief Asaduddin Owaisi) వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో వివాదానికి దారితీశాయి. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి డాక్టర్ కోట నీలిమ(Congress in-charge Dr. Kota Neelima)పై ఒవైసీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌(Telangana Women Commission)కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు.. మహిళా నాయకురాలి గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడం తగదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఒవైసీ వ్యాఖ్యలు సనత్‌నగర్ ప్రజలతో పాటు మహిళల మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఒవైసీ నుంచి వివరణ కోరాలని, వివాదాస్పద వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చూడాలని కాంగ్రెస్ నేతలు కమిషన్‌ను కోరారు.

అంతేకాకుండా కోట నీలిమకు బహిరంగంగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. ఒవైసీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కోట నీలిమ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు