బీహార్‌కు మోదీ డబుల్ ధమాకా

21-11-2026 | 06:16pm

పాట్నా: బీహార్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) శనివారం వైశాలిలో పర్యటించి సుమారు రూ.34,470 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 100 ఆధునిక పీఎం-ఈ-బస్సుల(PM E Bus)కు జెండా ఊపి ప్రారంభించారు.

గంగా నదిపై నిర్మించిన ఆరు లేన్ల ఆధునిక కేబుల్ స్టేడ్ వంతెన 'నితీశ్ సేతు'ను(Nitish Setu Bridge) కూడా జాతికి అంకితం చేశారు. సుమారు రూ.4,280 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన పాట్నా జిల్లాలోని కచ్చీ దర్గా నుంచి వైశాలి జిల్లాలోని బిదుపూర్‌ను కలుపుతుంది. మొత్తం 19.7 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టుతో ఉత్తర, దక్షిణ బీహార్ మధ్య రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు కూడా వెసులుబాటు కలగనుంది.

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద 26,900 మందికి పైగా లబ్ధిదారులకు గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. రహదారులు, విద్యుత్, పట్టణ మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, సాగునీరు, రవాణా రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బీహార్‌లో అభివృద్ధి పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి భారీగా తరలివచ్చిన జనసందోహమే నిదర్శనమని అన్నారు. ఛఠ్ మహాపర్వం అనంతరం ఇప్పుడు అభివృద్ధి పండుగను జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.

గతంలో బీహార్‌లో కుంభకోణాలు, నేరాల గురించే చర్చ జరిగేదని, ప్రస్తుతం పెట్టుబడులు, అభివృద్ధి, నేరస్థులపై చర్యల గురించి మాట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఉచిత రేషన్, పక్కా ఇళ్లు, ఆరోగ్య సేవల ద్వారా కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. బీహార్‌లో రవాణా సదుపాయాల విస్తరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని వార్తలు