చేతికొచ్చిన పంట నేలమట్టం!
తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు.. ఏడు ఎకరాల్లో వరి పంటకు నష్టం
ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వేడుకోలు
గరిడేపల్లి,(విజయక్రాంతి): ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్రజేసింది. తుఫాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు వరి పంట(Paddy Crop) నేలకొరగడంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. సూర్యాపేట జిల్లా(Suryapet District) గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన దొంతిరెడ్డి లింగారెడ్డి తనకున్న ఏడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట ఏపుగా పెరిగి గింజ గూడా పోసుకొని తరుణంలో తుఫాను ప్రభావంతో వీచిన గాలివానకు పొలంలోని వరి పంట మొత్తం నేలకొరిగింది.
పంట సాగు కోసం పెట్టుబడులు పెట్టి, నెలల తరబడి కష్టపడిన రైతుకు చేతికొచ్చే సమయంలో పంట దెబ్బతినడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రావని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని లింగారెడ్డి కోరుతున్నాడు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.