కాంగ్రెస్ పార్టీ కార్యాలయ స్థలాన్ని పరిశీలించిన మంత్రి
కొత్తగూడెం టౌన్,(విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ రైటర్ బస్తి గొల్లగూడెంలో కాంగ్రెస్(Congress Office Site) పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని గురువారం పరిశీలించారు. అనంతరం తన క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్, ఆర్ డి ఓ, రెవెన్యూ శాఖ అధికారులతో ఆయన సమీక్షా నిర్వహించారు.
ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ... పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా, వేగంగా ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల రెవెన్యూ అనుమతులు, ఇతర సాంకేతిక ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. స్థల సేకరణ, సరిహద్దుల గుర్తింపు, భూమి బదలాయింపు ప్రక్రియల్లో నిబంధనల ప్రకారం వేగంగా అడుగులు వేయాలని స్పష్టం చేశారు.
క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ప కలెక్టర్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొని, స్థలానికి సంబంధించిన నివేదికలను మంత్రికి సమర్పించారు. డిసిసి అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న, టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగా సీతా రాములు, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి ఆళ్ల మురళి, మాజీ జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఊకంటి గోపాలరావు, కోనేరు సత్యనారాయణ , నాగేంద్ర త్రివేది తదితరులు పాల్గొన్నారు.