విద్యార్థినుల భద్రతపై AIYF ఆందోళన

30-10-2026 | 12:18am

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచకుడైతే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి?

ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు మండలం రొంపేడు ఆశ్రమ పాఠశాల(Rompedu Ashram School)లో గిరిజన బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో AIYF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బృందం పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకుంది. తల్లిదండ్రులు లేని తొమ్మిదో తరగతి బాలికను కాంట్రాక్టు ఉపాధ్యాయుడు మాయమాటలతో నమ్మించి అసభ్యకర సందేశాలు, చాటింగ్ ద్వారా వేధించినట్లు బృందం పేర్కొంది. విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించాల్సిన ఉపాధ్యాయుడే ఇలాంటి చర్యలకు పాల్పడితే పేద గిరిజన విద్యార్థినుల భద్రత ఏమిటని ప్రశ్నించింది.

నిందితుడిపై పోక్సో చట్టం(POCSO Act) కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ పద్మను కోరినట్లు తెలిపింది. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతను నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని AIYF హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో AIYF జిల్లా కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు శరత్, దామోదర్, శ్రీకాంత్, సంతోష్, అనిల్, ఆరిఫ్, చేతన్, చరణ్, వెంకట్, వేణు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు