కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి

27-09-2026 | 06:55pm

గజ్వేల్, సెప్టెంబర్ 27: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) ఆశయాలను నేటి తరం కొనసాగించాలని ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డి బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి(Gajwel constituency in-charge Vanteru Pratap Reddy) పిలుపునిచ్చారు. బాపూజీ జయంతి సందర్భంగా ప్రజ్ఞాపూర్ రోడ్డులోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవం, అణగారిన వర్గాల హక్కులు, ప్రజాస్వామ్య విలువల కోసం బాపూజీ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ముఖ్యంగా పద్మశాలి, చేనేత సమాజం అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేనేత రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నేతన్నలకు అండగా నిలిచిందని తెలిపారు.

చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, బతుకమ్మ చీరల వంటి కార్యక్రమాలతో చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి, ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు. సాంకేతికత, మార్కెటింగ్, నైపుణ్యాభివృద్ధి, వర్క్‌షెడ్లు, కామన్‌ ఫెసిలిటీ సెంటర్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. బాపూజీ చూపిన మార్గంలో నడుస్తూ తెలంగాణ ఆత్మగౌరవంతో పాటు చేనేత కార్మికుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు, బాపూజీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు