అంగట్లో జనన ధ్రువీకరణ.!
డిజిటల్ సంతకాల చోరీ
మీసేవ కేంద్రంగా కేటుగాళ్ళ దందా
విచారణలో బయటపడ్డ మోసగాళ్ల బాగోతం
నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 26 విజయక్రాంతి: నాగర్ కర్నూల్ జిల్లాలో జనన ధ్రువీకరణ(Birth Certificate) పత్రాలు అంగట్లో అత్యంత సులువుగా దొరుకుతున్నాయి. ఒంటరి మహిళ పెన్షన్(Single woman pension) కోసం ఓ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి సహకారంతో మండల, డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారుల విచారణ లేకుండానే కొంతమంది కేటుగాళ్లు మీసేవ కేంద్రంగా ఒక్కరోజులోనే ధ్రువపత్రాన్ని సృష్టించారు. సాధారణ వ్యక్తులకు జనన, మరణ, కుల ఆదాయ పత్రాలు జారీ కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అలాంటిది సదరు గ్రామ పంచాయతీ కార్యదర్శికి కూడా తెలియకుండానే తన మెయిల్ ఐడి పాస్వర్డ్ హ్యాక్ చేసి జనన ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒంటరి మహిళ పెన్షన్ కోసం సదరు మహిళ మొదట అధికారులను ఆశ్రయించగా సమయం పడుతుందని చెప్పారు.
దీంతో కొంతమంది కేటుగాళ్లు 6000 ఇస్తే ధ్రువ పత్రం ఇస్తామని చెప్పి నమ్మించి నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ మీసేవ కేంద్రంలో జనన ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తు చేశారు. ఒక్కరోజులోనే ఆ మండల రెవెన్యూ అధికారులు డివిజన్ స్థాయి అధికారుల విచారణ లేకుండానే ఓ పంచాయతీ కార్యదర్శి సహకారంతో కొందరు కేటుగాళ్లు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఐడి పాస్వర్డ్ డిజిటల్ సంతకాలను చోరీ చేసి దృపత్రాన్ని సృష్టించారు. అనంతరం ఒంటరి మహిళ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా విచారణ ప్రారంభించిన అధికారులకు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
2002లో జన్మించిన ఆ ఒంటరి మహిళ 1995లో జన్మించినట్లుగా వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని ఓ గ్రామంలో జన్మించినట్లుగా జనన ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. దీంతో ఆధార్ ఇతర ధ్రువ పత్రాల ఆధారంగా అనుమానం వచ్చి విచారించగా పంచాయతీ కార్యదర్శి మేల్ ఐడి పాస్వర్డ్ డిజిటల్ సంతకాన్ని చోరీ చేసినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా షాక్ గురైంది. ఈ అంశాన్ని అత్యంత రహస్యంగా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.