శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి
- సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేట క్రైం: ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తోందని సీపీ రష్మీ పెరుమాళ్ చెప్పారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీసీ కెమెరాలు, షీ టీమ్స్, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ పనితీరును ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా వివరించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, డయల్ 112 సేవలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీపీ సూచించారు.
కార్యక్రమంలో అదనపు డీసీపీ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది బక్రిచెప్యాల, రంగదాంపల్లి, దుద్దెడ, ఎన్సన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, నాంచార్పల్లి, మిట్టపల్లి ఎంపీపీఎస్, ఇందిరానగర్ హైస్కూల్, టీజీ రెసిడెన్షియల్ స్కూల్ ఎన్సన్పల్లి, సిటిజన్ స్కూల్, క్రాంతి స్కూల్, మెరిడియన్ స్కూల్కు చెందిన 800 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ విధులు, ఆయుధాలు, డయల్ 112 అత్యవసర సేవలు, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. పోలీసుల సేవలు, త్యాగాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ మురళి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.