వరి కోస్తుండగా భారీ కొండచిలువ ప్రత్యక్షం

24-10-2026 | 10:43pm

నేలపట్లలో 10 నుంచి 12 అడుగుల పొడవున్న కొండచిలువ కలకలం

కూసుమంచి, అక్టోబర్ 24(విజయక్రాంతి): వరి పంట(Paddy crop) కోస్తుండగా భారీ కొండచిలువ(Python) ప్రత్యక్షం కావడంతో రైతులు(Farmers) ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా(Khammam District) కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అలవాల లింగయ్య పొలంలో వరి కోస్తుండగా సుమారు 10 నుంచి 12 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ కనిపించింది. ఊహించని విధంగా పొలంలో కొండచిలువ కనిపించడంతో భయపడిన రైతు వెంటనే స్థానికులకు సమాచారం అందించారు.

దీంతో అక్కడికి చేరుకున్న రైతులు కొండచిలువను చూసి ఆందోళనకు గురయ్యారు. అనంతరం వారు కొండచిలువను హతమార్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. వరి కోతల సమయంలో పొలాల్లో పాములు కనిపించే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పంట కోసే సమయంలో పరిసరాలను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు