రోడ్డుపై బైఠాయించి నిరసన.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

04-11-2026 | 11:14pm

విధుల నుంచి తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన

ఇచ్చోడ (విజయక్రాంతి): ఇచ్చోడ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని విధుల బాధ్యతల నుంచి తొలగించడంపై విద్యార్థులు ఆందోళన(Students Protest)కు దిగారు. ప్రధానోపాధ్యాయుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం పాఠశాల నుంచి బయటకు వచ్చి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) మంగళవారం ప్రధానోపాధ్యాయుడిని బాధ్యతల నుంచి తప్పించినట్లు సమాచారం.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఆయన్నే కొనసాగించాలని నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనతో కొద్దిసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరారు. ప్రధానోపాధ్యాయుడిని తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు తమ నిరసనను కొనసాగిస్తామనే రీతిలో విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు