అక్షరాల బాటలో మహిళలు

27-09-2026 | 08:03pm

- ఉల్లాస్ పరీక్ష రాసిన 780 మంది

- మండల మహిళా సంఘం అధ్యక్షురాలు హీనా బేగం వెల్లడి

నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలవ్యాప్తంగా 780 మంది మహిళలు ఉల్లాస్ పరీక్ష రాశారని మండల మహిళా సంఘం అధ్యక్షురాలు హీనా బేగం(Mandal Women's Association President Heena Begum) తెలిపారు. ఆదివారం ఆమె విజయక్రాంతితో మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల నుంచి మహిళా సంఘాల సభ్యులు పరీక్షలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ‘అమ్మకు అక్షరమాల’ అని కూడా పిలుస్తారని తెలిపారు. ఏపీఎం నర్సింలు, సీసీలు, వీవోఏలు సమన్వయంతో పనిచేసి మహిళలు పరీక్షలకు హాజరయ్యేందుకు సహకరించారని వివరించారు.చదువుకునే అవకాశం లభించని 15 ఏళ్లు పైబడిన వారికి అక్షరాస్యత అందించడం ఉల్లాస్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. చదవడం, రాయడం, ప్రాథమిక లెక్కలతోపాటు నిత్యజీవితానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతకూ ఇందులో ప్రాధాన్యం కల్పిస్తున్నారు.

మహిళలు అక్షరాస్యత సాధించడం ద్వారా సంఘాల పొదుపు, రుణాల లెక్కలను అర్థం చేసుకోవడం, బ్యాంకు లావాదేవీలపై అవగాహన పెంచుకోవడం, దరఖాస్తులను పూరించడం వంటి పనులను స్వయంగా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలను చక్కబెట్టుకోవడంతోపాటు పిల్లల చదువుకు సహకరించేందుకూ అక్షరజ్ఞానం ఉపయోగపడుతుంది. మండలవ్యాప్తంగా మహిళలు ఉల్లాస్ పరీక్షలో పాల్గొనడం అక్షరాస్యత సాధన దిశగా ముందడుగుగా నిలిచింది.

మరిన్ని వార్తలు