గంగకత్వ కాలువ ఆధునీకరణకు రూ.37.81 కోట్లు మంజూరు !

07-09-2026 | 11:57pm

నిధులు మంజూరు చేస్తూ జివో విడుదల చేసిన నీటిపారుదల శాఖ

జ‌గ్గారెడ్డి కృషితో 3000 ఎకరాల ఆయకట్టుకు అందనున్న సాగు నీరు

సంగారెడ్డి,(విజ‌య‌క్రాంతి): సదాశివపేట మండలం(Sadashivapet mandal) సూరారం గ్రామం నుండి మొదలయ్యే  నిజాం కాలం నాటి  గంగ కత్వ కాలువ ఆధునీకరణకు  టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(TPCC Working President Jagga Reddy) చొరవతో ఎట్టకేలకు మోక్షం లభించింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ కాలువ ఇప్పటివరకు మరమ్మత్తుకు నోచుకోలేదు. దశాబ్దాల పాటు మరమ్మత్తుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా పనులకు మోక్షం కలుగలేదు. గంగకత్వ ఆయకట్టు రైతులు(Farmers), స్థానిక నేతల కోరిక మేరకు  జగ్గారెడ్డి  మూడు నెలల క్రితం  నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆధునీకరణ పనుల కోసం వెంటనే కొత్త ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. 

కాలువ ఆధునీకరణ పనులకోసం నీటి పారుదల శాఖ అధికారులు  ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ ప్రతిపాదనలకు ఆమోదిస్తూ రూ 37.81 కోట్లు మంజూరుకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ నీటిపారుదలశాఖ జీవో విడుదల చేసింది. గంగకత్వ కాలువకు నిధులు మంజూరుపై జగ్గారెడ్డి, డిసిసి అధ్యక్షురాలు నిర్మల జ‌గ్గారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఆధునీకరణ పనులు ఇలా...

గంగకత్వ కాలువ సదాశివపేట మండలం సూరారం గ్రామంలో ప్రారంభమై  11 గ్రామాలను కలుపుతూ సదాశివపేట మండలంలోని మాచిరెడ్డిపల్లి గ్రామం వరకు సుమారు 15 కిలో మీటర్ల పొడవునా విస్తరించి ఉంది. గంగకత్వ కాలువకు 33  చెరువుల నుండి  ఫీడర్ చానల్స్ ఉన్నాయి. ఆధునీకరణ పనుల్లో భాగంగా కాలువకు లైనింగ్ పనులు చేపడతారు. కాలువ పైన అవసరం ఉన్న చోట కొత్త బ్రిడ్జి ల నిర్మాణం, పాత వాటికి మరమ్మత్తు పనులు చేస్తారు. దీనితో పాటు కాలువ పొడవునా తుములకు రిపేర్లు చేస్తారు. ఈ కాలువ పనులు పూర్తయితే  3000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు.

మరిన్ని వార్తలు