ఇనుప రాడ్డే మృత్యు పాశం

08-09-2026 | 12:52am

హెచ్‌టీ లైన్‌కు తగిలి వ్యక్తి దుర్మరణం

పాపన్నపేట: వ్యవసాయ(Agriculture) పనులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. పాపన్నపేట మండలం చిత్రియాల్ శివారులోని ఏనె ప్రాంతంలో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గాజులగూడెం గ్రామానికి చెందిన పుట్టల కుమార్(35)వ్యవసాయంతో పాటు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఏనె ప్రాంతంలో షెడ్డు నిర్మాణానికి సంబంధించిన ఇనుప సామాగ్రిని ట్రాక్టర్‌లోకి ఎక్కిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఓ ఇనుప రాడ్డు సమీపంలోని హెచ్‌టీ విద్యుత్ సరఫరా లైన్‌కు తగిలింది.

దీంతో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగి కుమార్‌కు తీవ్ర విద్యుత్ షాక్(Electric shock) తగిలింది. ప్రమాద తీవ్రతకు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి కుమార్‌ను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి, మృతుడి భార్య దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాపన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య దుర్గమ్మ, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్ మృతితో గాజులగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు