కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన

08-09-2026 | 12:28am

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు వినతిపత్రాలు

చిట్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress government) వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Former MLA Chirumarthi Lingaiah) ఆదేశాల మేరకు సోమవారం చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ డే కార్యక్రమంలో చిట్యాల పట్టణంలోని పలు ప్రజా సమస్యలపై మున్సిపల్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిట్యాల ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని, ఇటీవల బండారు జనార్ధన్‌ అనే వ్యాపారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్‌ పనులను వెంటనే వేగవంతం చేయాలని కోరారు.

అలాగే చిట్యాల పట్టణంలోని పారిశుద్ధ్య సమస్యలు, మరుగుకాలువల సమస్యలను పరిష్కరించాలని, రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా అందించి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులకు యూరియా కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని కోరారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 10వ వార్డులో ఓపెన్‌ డ్రైనేజీపై స్లాబ్‌ నిర్మించాలని, మేడం పండు కాలనీలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్‌ రూ.4,016 అందించాలని, రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ అందించడంతో పాటు ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని కూడా అమలు చేయాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి, స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, జమాండ్ల  శ్రీనివాస్ రెడ్డి, బొబ్బలి శివ శంకర్ రెడ్డి, పదో వార్డ్ కౌన్సిలర్ నిమ్మనుకోటి శ్రీనివాస్, రెండోవార్డ్ కౌన్సిలర్ షబానాజీ, రాచకొండ కృష్ణయ్య, సుర్కంటి నర్సిరెడ్డి,సాయిరెడ్డి ప్రతాపరెడ్డి, నాలావత్ కృష్ణ నాయక్, చెరుకు బాలకృష్ణ, ఉప్పలపల్లి నాగేష్, తోటకూరి అనిల్, జమాండ్ల చందు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు