ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం: బి.శరణప్ప
కారాముంగిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి
నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి (టీఆర్‌ఆర్‌ఎస్) మీడియా కార్యదర్శి బి. శరణప్ప అన్నారు. నాగల్‌గిద్ద మండలంలోని కారాముంగి గ్రామంలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు పూలమాలలు సమర్పించి ఆమెకు ఘన నివాళులర్పించారు.శరణప్ప మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ చిరస్మరణీయమన్నారు. దోపిడీ, అణచివేతలను ఎదిరించి ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్, రజక సంఘం నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.