ఎత్తుబోడ ప్రాంతంలో వెలిసిన ఎల్లమ్మ తల్లి

24-11-2026 | 09:18pm

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.

కోనరావుపేట నవంబర్ 24 (విజయక్రాంతి):కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని(Marrimadla Village) ఎత్తుబోడ ప్రాంతంలో ఎల్లమ్మ తల్లి(Yellamma Devi) వెలిసినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చెట్టు మొదలు వద్ద వెలిసిన ఎల్లమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పూలమాలలు, నూతన వస్త్రాలతో ఘనంగా అలంకరించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, పండ్లు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మహిళలు సామూహికంగా ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ఎత్తుబోడ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోల స్వాతి శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు కుమ్మరి సునీత దిలీప్ కుమార్, అక్కెనపల్లి రమేష్, భాస్కర్, మధుకర్, సుంకటి అశోక్, దుంపేట రాజేశం, కొండం దేవనర్సయ్య, బొల్లం అంజయ్య, ఆకుల చిన్న చంద్రమౌళి, ఇండ్ల సత్తయ్య, గోవర్ధన్, అంజయ్య, సత్తయ్య, కమలాకర్ తదితరులతో పాటు గ్రామ మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు