రాజ్యాంగబద్ధమైన పాలన కోసమే నా పోరాటం

24-11-2026 | 09:28pm
  1. పార్టీల ప్రభావం, ప్రలోభాలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి
  2. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లకు మళ్లీ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు
  3. ఖమ్మం–వరంగల్‌–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి నలమాస కృష్ణ గౌడ్‌

ఖమ్మం టౌన్ నవంబర్ 24 విజయ క్రాంతి: రాజ్యాంగ విలువల పరిరక్షణ(Preservation of Constitutional Values), సామాజిక న్యాయం, పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యంగా ఖమ్మం–వరంగల్‌–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు హైకోర్టు న్యాయవాది నలమాస కృష్ణ గౌడ్‌ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రభావం, డబ్బు, కుల సమీకరణాలకు అతీతంగా పట్టభద్రుల గొంతుకగా శాసనమండలిలో నిలబడటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

మంగళవారం ఖమ్మం నగరంలోని వేదిక ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనది మూడు దశాబ్దాల ప్రజా ఉద్యమ ప్రస్థానమని, విద్యార్థి ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, సామాజిక న్యాయ పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నానని తెలిపారు. అవినీతి, అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అనేక కేసులను ఎదుర్కొన్నట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో లేవనెత్తిన అనేక నినాదాలు, డిమాండ్లు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పలువురు నాయకులు మంత్రులు,

ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రుల స్థాయికి ఎదిగితే, అదే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తాను మాత్రం రాజద్రోహం కేసులను ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అపరిష్కృతంగా ఉన్న తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పోరాడినందుకే తనపై కేసులు నమోదయ్యాయని, వాటిని ఉద్యమ స్ఫూర్తితోనే ఎదుర్కొంటానని పేర్కొన్నారు.

గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన వారు పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని ఓటర్లు సమీక్షించుకోవాలని సూచించారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు మళ్లీ ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉన్నత విద్యలు అభ్యసించిన యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.

రాష్ట్రంలో అవినీతి వ్యవస్థీకృతంగా మారిందని, సామాన్యులు లంచం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. పెద్దల అవినీతిని కాపాడుతూ చిరుద్యోగులపై చర్యలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో వ్యవస్థాగత అవినీతి జరుగుతున్నప్పుడు దాని ఫలాల్లో పెద్దలకు వాటాలు లేవా? అని ప్రశ్నించారు.

కులవృత్తులు, వెనుకబడిన వర్గాల జీవనాధారాల పరిరక్షణతోపాటు సమసమాజ నిర్మాణానికి పాలకులు కృషి చేయాలని కోరారు. ఎన్నికల్లో డబ్బు, కులబలం, రాజకీయ పలుకుబడిని కాకుండా అభ్యర్థుల వ్యక్తిత్వం, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై అవగాహనను చూసి పట్టభద్రులు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

రాజకీయ అండదండలు, ఆర్థిక బలం లేకపోయినా ప్రజా ఉద్యమాల్లో తనతో కలిసి పనిచేసిన మేధావులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగినట్లు వెల్లడించారు. పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై అధికార, ప్రతిపక్ష సభ్యులతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఇందుకు ఖమ్మం చైతన్యవంతమైన పౌర సమాజం చొరవ తీసుకోవాలని కోరారు. శాసనమండలిలో పట్టభద్రుల సమస్యలను బలంగా ప్రస్తావిస్తూ నిరుద్యోగులు, ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాడతానని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, నిరుద్యోగ యువత భవిష్యత్తు, పట్టభద్రుల హక్కుల పరిరక్షణ కోసం తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు అర్వపల్లి విద్యాసాగర్‌రావు, గోపా శ్రీనివాస్‌ గౌడ్‌, టీజేఎఫ్‌ జిల్లా కార్యదర్శి చిర్రా రవి, కోయ చంద్రమోహన్‌, సంగమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు