హనుమకొండలో పొలిటికల్ హీట్..

24-11-2026 | 08:43pm

హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మధ్య గత రెండు రోజులుగా కొనసాగుతున్న మాటల యుద్ధం చివరకు కార్యకర్తల ఘర్షణకు దారితీసింది. మంగళవారం హనుమకొండలోని బాలసముద్రంలో ఉన్న బీఆర్ఎస్(BRS) పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం తలపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్(Congress) కార్యకర్తలు తొలుత హనుమకొండ కూడలి వద్ద ఆందోళన చేపట్టారు.

సాయంత్రం కాంగ్రెస్ కార్యకర్తల బృందం బీఆర్ఎస్ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలు చించివేయడంతో పాటు ఇరువర్గాల కార్యకర్తలు గుడ్లు, టమోటాలు, రాళ్లు విసురుకున్నారు. సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరుపార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు