జనసంద్రంగా మారిన యాదగిరిగుట్ట
- కార్తీక పౌర్ణమి వేళ.. జనసంద్రంగా మారిన యాదగిరిగుట్ట....
- విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ విజయరాజం
యాదగిరిగుట్ట, నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి(Karthika Pournami) పర్వదినాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy) వారి దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. పౌర్ణమి వేళ హరిహరులను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు మంగళవారం తెల్లవారుజాము 4 గంటల నుంచే భక్తులు భారీ సంఖ్యలో కొండపైకి చేరుకున్నారు.
దీంతో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణ, ఓం నమఃశివాయ పంచాక్షరీ మంత్రోచ్ఛారణలతో మార్మోగుతున్నాయి. శివాలయంలో స్ఫటిక లింగానికి అభిషేకాలు, కార్తీక దీపారాధనలతో క్షేత్రమంతా భక్తజన సంద్రంగా మారింది... కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాలకమండలి సభ్యురాలు, విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ విజయ రాజం భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు.
కొండపైన స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో శివుడికి అభిషేక పూజలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోరికలను తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వరాలయంలో స్పటిక లింగము స్వయంభు లింగానికి అభిషేకాలు చేయడం జరిగిందని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలలో పాల్గొని తమ మొక్కలను చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు తీసుకున్న చర్యల పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని ముందుగానే అంచనా వేసిన దేవస్థానం అధికారులు, ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.
భక్తుల తాకిడికి అనుగుణంగా వ్రత మండపంలో ప్రత్యేకంగా బ్యాచ్ ల వారీగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలను నిరంతరాయంగా నిర్వహించారు. వేకువజాము నుంచే దంపతులు, కుటుంబ సభ్యులు వ్రత పీఠాల వద్ద కూర్చుని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో వ్రతాలను ఆచరించారు.
భక్తులకు వ్రత సామగ్రి అందజేయడం నుండి, ప్రసాద వితరణ వరకు సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సత్యనారాయణ స్వామి వ్రతాల అనంతరం భక్తులు, కొండపైన స్వామి వారిని దర్శించుకున్నారు ధర్మదర్శనానికి మూడు గంటలు స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది కొండపైన భక్తులతో పురవీధులన్నీ కిటకిటలాడాయి.