తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) జిల్లా ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందిస్తూ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే(SP Mahesh B. Gite) సూచించారు. శుక్రవారం తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్ వ్యవస్థను సమీక్షించారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, చోరీలు, గంజాయి అక్రమ రవాణా(Illegal trafficking of cannabis), అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. యువత సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల బారిన పడకుండా గ్రామాలు, విద్యాసంస్థలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడంతో పాటు హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.