ప్రతి ఉద్యోగి విధులను నిజాయితీతో నిర్వహించాలి
విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో ఏరియా ఇంచార్జి జీఎం డి శ్యామ్ సుందర్
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ప్రతి ఉద్యోగి తమ విధులను బాధ్యతగా, నిజాయితీతో నిర్వహించాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా ఇంచార్జి జనరల్ మేనేజర్ డి శ్యామ్ సుందర్(Singareni GM D Shyam Sundar) అన్నారు. ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2026 నిర్వహించగా వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అవగాహన కరపత్రాలను ఆవిష్కరించి ఉద్యోగులతో అవినీతి నిర్మూలన, నిజాయితీ, నైతిక విలువలకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి రహిత పరిపాలన సంస్థ అభివృద్ధికి, ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనలను పాటించాలని సూచించారు. విజిలెన్స్ అవగాహన అనేది కేవలం ఒక వారానికే పరిమితం కాకుండా నిత్య జీవితంలోనూ, విధి నిర్వహణలోనూ భాగం కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఈడి ఏజీఎం జోతి, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ టి పోషమల్లు, ఏఐటీయూసీ నాయకులు మోటపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ నాయకులు బేతెల్లి మధూకర్ రెడ్డి, భూపాలపల్లి సీఎంఓఐఎ అద్యక్షులు నజీర్, ఐటిచ సీనియర్ ప్రోగ్రామర్ శంకర్, పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.