ఎన్నికల హామీలను అమలు చేయాలి
- పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రించాలి
- బోధన్‌లో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో ర్యాలీ, ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
- బోధన్ ఆర్డిఓ కు వినతి పత్రం అందజేశారు
బోధన్, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల(Congress party elections) సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో మంగళవారం బోధన్‌లో ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి మందిరం నుంచి ప్రారంభమైన ర్యాలీ షర్బత్ కెనాల్, అంబేద్కర్ చౌరస్తా, రైల్వే గేట్, మున్సిపల్ కార్యాలయం మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు సాగింది. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రంతో పాటు ప్రజల వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ఎం. నరేందర్, జిల్లా సీనియర్ నాయకుడు కే. గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించాలని, నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలని కోరారు.
రైతులకు నాణ్యమైన, కోతలు లేని విద్యుత్ సరఫరా చేయడంతో పాటు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమైతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
డివిజన్ కార్యదర్శి డి. రాజేశ్వర్, సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ కార్మికుల వేతనాలు పెరగకపోవడం, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కాకపోవడం, నిత్యావసర ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం భారంగా మారిందన్నారు. ప్రజలు, కార్మికులపై పన్నుల భారాన్ని మోపుతూ దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీలను అమలు చేయకపోతే గత పాలకులకు పట్టిన గతే ప్రస్తుత పాలకులకు పడుతుందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్, ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి. సీతారాం, ఓడ్డెన్న, ఎస్.కే. నజీర్, జి. రాములు, దేవయ్య, బి. సాయిలు, గంగారాం, సలీం, మోహన్, డి. నాగేశ్వర్, నరేష్‌తో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.