చేపూర్ గ్రామంలో ఘనంగా ప్రారంభమైన భీమన్న కల్యాణ ఉత్సవాలు
ఆర్మూర్, నవంబర్ 27 (విజయ క్రాంతి) : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఆదివాసి నాయకపోడ్(Adivasi Nayakpod) కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీశ్రీ భీమన్న కల్యాణ ఉత్సవాలు(Sri Sri Bhimanna Kalyana Utsavams) శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివాసి నాయకపోడ్ సంఘం పెద్దమనుషులు మేడిపల్లి గౌతమ్, కునాల నరేష్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆదివాసి నాయకపోడ్ కులస్తులు తమ కులదైవమైన శ్రీశ్రీ భీమన్న కల్యాణ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం గ్రామ శివారులోని భీమన్న ఆలయం నుంచి స్వామివారి గదలను మహిళలు, చిన్నారులు మంగళవాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా గ్రామంలోని సంఘ భవనం వరకు తీసుకువచ్చారు.
శనివారం ఉదయం గ్రామంలోని సంఘ భవనం నుంచి శ్రీశ్రీ భీమన్న స్వామివారి గదలను ఊరేగింపుగా గ్రామంలోని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బాల్కొండ మండలం నాగపూర్ గ్రామ శివారులోని గోదావరి నది వద్దకు చేరుకుని స్వామివారి గదలకు జలాభిషేకం నిర్వహిస్తారు. ఆదివాసి నాయకపోడ్ కులస్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అనంతరం స్వామివారి గదలను చేపూర్ గ్రామ శివారులోని భీమన్న ఆలయానికి తీసుకువెళ్తారు.