కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ జయంతి
నిర్మల్ సెప్టెంబర్ 26 ( విజయ క్రాంతి): కలెక్టరేట్ సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ జయంతి(Chakali Ailammas Birth Anniversary) వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర, ఆమె పోరాట స్ఫూర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. నాటి కాలంలో రజాకారులు, దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి ఐలమ్మ అని పేర్కొన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలనతో పాటు అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఈ డి ఎస్సి కార్పొరేషన్ శంకర్, కార్మిక శాఖ అధికారి రాజలింగు, సహాయ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, రాష్ట్ర మానవ హక్కుల సంఘం వైస్ ప్రెసిడెంట్ అర్చన, కుల సంఘాల నాయకులు సుంకెట పోశెట్టి, గజ్జారాం, గంగాధర్, మస్కాపురం పోశెట్టి, రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.