జూరాల.. జల జగడం
సాగునీటి కోసం రైతుల ఆందోళన.. కాలువలోకి దిగి నిరసన
- అడ్డుకున్న పోలీసులు.. తోపులాట
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం అరెస్టు
- బీఆర్‌ఎస్ నేతల నిర్బంధం
- ప్రాజెక్టు వద్ద భారీ బందోబస్తు
వనపర్తి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): జూరాల ఆయకట్టు(Jurala Ayacut) పంటలకు సాగునీరు విడుదల చేయాలన్న డిమాండ్‌తో సోమవారం రైతులు(Farmers) చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు పెద్దఎత్తున జూరాల ప్రాజెక్టు వైపు తరలివచ్చారు. రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు ప్రాజెక్టు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుని భారీగా బలగాలను మోహరించారు. ప్రధాన రహదారులపై పోలీసుల ఆంక్షలు(Police restrictions) ఉండటంతో రైతులు పొలాల వెంబడి నడుచుకుంటూ ప్రాజెక్టు వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు.
పోలీసులు వారిని అడ్డుకోవడంతో పలుచోట్ల వాగ్వాదం చోటుచేసుకుంది. అయినా రైతులు వెనక్కి తగ్గకుండా సాగునీటి కోసం ఆందోళన కొనసాగించారు. సాగునీరు ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో కొందరు రైతులు ప్రాణాలకు తెగించి జూరాల ఎడమ కాలువలోకి దిగారు. రెగ్యులేటర్ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ధర్నా చేసేందుకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. రైతులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు బలప్రయోగం చేసినట్లు రైతులు ఆరోపించారు.
నీళ్ల కోసం నిరీక్షణ
జూరాల నుంచి సాగునీటి విడుదలపై అధికారుల నిర్ణయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పంటలను కాపాడేందుకు వెంటనే ఎడమ కాలువలకు నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో కోయిల్‌సాగర్, సంగంబండ రిజర్వాయర్ల కింద కూడా సాగునీరు విడుదల చేయాలని రైతుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. పోలీసులతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అక్కడే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే చిట్టెం అదుపులోకి
రైతులతో కలిసి ధర్నాలో పాల్గొనేందుకు జూరాల ప్రాజెక్టు వద్దకు వచ్చిన మక్తల్ మా జీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీ సులతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం చిట్టెం రామ్మోహ న్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బీఆర్‌ఎస్ నేతల నిర్బంధం
జూరాల వద్ద రైతులతో కలిసి ధర్నాకు బీఆర్‌ఎస్ పిలుపునివ్వడంతో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పో లీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జూరాల వైపు వెళ్లకుండా నిర్బంధించడంపై బీఆర్‌ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. రైతులకు మద్దతుగా పార్టీ శ్రేణులు నిరసనలకు దిగాయి.