ఇనుగుర్తిలో ‘పంచాయతీ’ఆఫీసు..!?
అటూ ఇటూ పదిలం.. నడి ‘మధ్య’ న శిథిలం
ఇనుగుర్తి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal District)లో చారిత్రాత్మకమైన గుర్తింపు కలిగి, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో అత్యధిక జనాభా కలిగిన గ్రామంగా, మేజర్ పంచాయతీ(Major Panchayat)గా గుర్తింపు పొందిన ఇనుగుర్తి పంచాయతీ గ్రామ పరిపాలన(Inugurthi Panchayat Village Administration) నిర్వహించడానికి సరైన వసతి లేక అవస్థలు పడుతోంది. పాలక మండలికి సరైన వసతి లేక, పంచాయతీ నిర్వాహనకు అవసరమైన సామాగ్రి నిలవకు కూడా భవనం లేకపోవడంతో నిర్వహణకు ఇబ్బందిగా మారింది.
14 మంది వార్డు సభ్యులు సర్పంచ్, ఆఫీసు స్టాఫ్, ఇద్దరు ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు సమావేశం నిర్వహిస్తే కూర్చోవడానికి సరైన వసతి లేదు. అలాగే కార్యాలయ నిర్వహణకు, పంచాయతీ కార్యదర్శి(Panchayat Secretary), సర్పంచికి ప్రత్యేక గది లేదు. ఇవన్నీ అటు ఉంచితే కార్యాలయ రికార్డులు భద్రపరచడానికి సరైన వసతి లేదు. 1968లో బెంగళూరు పెంకుతో నిర్మించిన పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. పైకప్పు పూర్తిగా దెబ్బతిని వర్షానికి కురుస్తోంది. దీనితో కార్యాలయంలో రికార్డులు, సామాగ్రి భద్రపరచడానికి ఇబ్బంది పడుతున్నారు.
గత ఏడాది డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల(Panchayat elections) సందర్భంగా సర్పంచ్ గా ఎన్నికైన తమ్మడపల్లి కుమార్ ఆధ్వర్యంలో శిథిలావస్థకు చేరిన పంచాయతీ కార్యాలయానికి స్వల్ప మరమ్మతులు చేయించి రంగులు వేయించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇనుగుర్తి గ్రామపంచాయతీకి మెరుగైన వసతి కల్పించేందుకు 25 లక్షల రూపాయల ఎంపీ కోట కింద నిధులను మంజూరు చేశారు. భవనం నిర్మాణం పూర్తి చేసినప్పటికీ పంచాయతీకి భవనాన్ని అప్పగించకుండా తాళవేసి ఉంచారు. దీంతో పంచాయతీ నూతన భవనం అలంకార ప్రయంగా మారింది.
తహసిల్ ఆఫీస్‌కు.. మరొకటి!
గతంలో పంచాయతీ కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కార్యాలయాన్ని నిర్మించారు. అయితే ఇనుగుర్తి మేజర్ పంచాయతీకి సరిపడా భవనం లేదని, చిన్న పంచాయతీకి కేటాయించిన విధంగా నిధులు కేటాయించారని, ఆ భవనాన్ని వినియోగించకుండా సామాగ్రి పెట్టడానికి వాడుకునేవారు. ఈ క్రమంలో ఇనుగుర్తి మండలంగా ఏర్పడడంతో ఆ భవనాన్ని కాస్తా తహసిల్దార్ కార్యాలయం కోసం కేటాయించారు.
దీనితో పంచాయతీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఉన్న కొద్దిపాటి వసతి లేక, ప్రస్తుతం ఉన్న కార్యాలయం శిథిలమైపోవడం, ఇరుకుగా మారి, కొత్తది అప్పగించకపోవడంతో.. అటు ఇటు పదిలమైన భవనాలు.. మధ్యలో శిథిలమైన భవనంలో పంచాయితీ నిర్వహించాల్సిన పరిస్థితి ఇనుగుర్తిలో నెలకొంది.
నూతన భవనాన్ని అప్పగించాలి
పంచాయతీ కోసం నిర్మించిన నూతన భవనాన్ని వెంటనే అప్పగించాలి. ఎంపీ రవిచంద్ర కృషితో ఎంపీ నిధులు కేటాయించి గ్రామపంచాయతీకి మెరుగైన వసతి కల్పించారు. అయితే భవన నిర్మాణం పూర్తి చేసినప్పటికీ పంచాయతీకి అప్పగించకుండా జాప్యం చేస్తున్నారు. గతంలో నిర్మించిన పంచాయతీ భవనం రెవెన్యూ శాఖకు అప్పగించారు. దీనితో పంచాయతీ నిర్వహణ ఇబ్బందిగా మారింది. వెంటనే అధికారులు స్పందించి నూతన పంచాయతీ భవనాన్ని వినియోగంలోకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
- తమ్మడపల్లి కుమార్, సర్పంచ్, ఇనుగుర్తి