యాప్‌లో నిమిషాల్లోనే యూరియా మాయం
- స్టాక్ కొరతతో రైతుల ఆవేదన
- మ్యాపింగ్ లేక గ్రామాల గల్లంతు
- అధిక ధరలకు విక్రయాలు
- అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు
నంగునూరు, సెప్టెంబర్ 3 : రైతులకు ఎరువుల బుకింగ్ను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్ వర్క్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్ ఎఫ్ ఎస్)(Framework Fertilizer Sale) విధానం నంగునూరు మండల రైతులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దళారులను అరికట్టేందుకు తెచ్చిన ఈ విధానంపై సరైన అవగాహన లేకపోవడం, సాంకేతిక లోపాలతో రైతులను చిక్కుల్లోకి నెడుతోంది. స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, సర్వర్ సమస్యలు, ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేకపోవడం వంటి సమస్యలతో రైతులు సకాలంలో యూరియా బుక్ చేసుకోలేకపోతున్నారు.
క్షణాల్లోనే యూరియా మాయం
యాప్లో యూరియా కోసం బుక్ చేసుకునే లోపే స్టాక్ క్షణాల్లో మాయమవుతుండటంతో రైతులకు నిరాశే మిగులుతోంది. గ్రామాల్లోని ఏఈవోలు సరైన సమయాల్లో రైతన్నలకు బుకింగ్ సమాచారం అందించడం లేదనే విమర్శలున్నాయి. కేవలం వాట్సాప్ మెసేజ్ల ద్వారా సమాచారం ఇస్తున్నారే తప్ప ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాగిన్ చేసిన క్షణాల్లోనే యాప్లో యూరియా అందుబాటులో ఉండడం లేదని, డీలర్లు లేదా అధికారుల చేతుల్లోనే స్టాక్ అప్లోడ్, రిలీజ్ ఉంటుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఫెర్టిలైజర్ దుకాణదారులు తమకు అనుకూలమైన వారికి రాత్రి సమయాల్లో బుకింగ్ సమాచారం అందిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మండల పరిధిలోని నర్మెట, వెంకటాపూర్ గ్రామాల రైతులు యూరియా బుకింగ్ కోసం యాప్ తెరవగా, అందులో తమ గ్రామాల పేర్లు కనబడడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధిక ధరలకు విక్రయాలు..
మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి, ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నంగునూరు మండలంలో యూరియా బస్తాలను అధిక ధరలకు అమ్ముతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన యూరియా బస్తా ధర రూ.266.50 ఉండగా, రూ.300కు పైగా వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఓ గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఓ రైతు పది బస్తాల యూరియాను విక్రయిస్తే, రసీదు ఇవ్వకుండా రూ.3000 చెల్లించమని వాపోయాడు.
ప్రశ్నిస్తే రవాణా, హమాలీ ఖర్చులు అంటున్నారని, అదనపు మొత్తాన్ని బిల్లులో నమోదు చేసి ఇవ్వాలని కోరినా బిల్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, యూరియాతో పాటు కొన్ని అదనపు మందులను జతకట్టి బలవంతంగా విక్రయిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ ధరలకే ఎరువులు విక్రయించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.తనిఖీలు కేవలం ప్రచారానికే పరిమితం అవుతున్నాయని,అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి.
అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు
ఈ విషయం పై ఏంఏవో గీతా ను వివరణ కోరగా.. ఎరువులను ప్రభుత్వ ధరలకే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు అమ్మితే దుకాణదారులపై కఠిన చర్యలు తప్పవని, స్టాక్సిల్ (నిఘా/చర్యలు) వేస్తామని హెచ్చరించారు. సర్వర్ బిజీ సమస్యలు, ’నో స్టాక్’ ఇబ్బందిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
ప్రత్యేకంగా మండల పరిధిలోని వెంకటాపురం, నర్మెట్ట గ్రామాల రైతుల ప్రస్తుతం సమస్యను పరిష్కరిస్తూ, యాప్లో ప్రత్యేక ఫేస్ అథెంటిఫికేషన్తో యూరియాను అందజేసే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రైతులకు ఏలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.
మండల వ్యవసాయ శాఖ అధికారి, నంగునూరు
తిరుపతి టికెట్ల కంటే కష్టమే
యాప్‌లొ యూరియా బుక్ చేసుకోవడం తిరుమల ఏడుకొండల దర్శన టికెట్లు బుక్ చేసుకున్నంత ఎక్కువ కష్టంగా మారింది. యాప్లో యూరియా దొరకట్లేదు.లాగిన్ చేసిన క్షణాల్లోనే మాయమవుతుంది. రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారులు పట్టించుకోనీ, సకాలంలో యూరియా అందించి రైతులను ఆదుకోవాలి.
-మాటురి రాజు, రైతు, గట్లమల్యాల






