4 September, 2026 | 7:32 PM

జగన్నాథుడి పేరిట వేలకోట్లు

04-09-2026 | 06:05am

రూ.1,912 కోట్లు, 60,821 ఎకరాల భూమి

ప్రకటించిన ఆలయ పరిపాలనాధికారి

భువనేశ్వర్, సెప్టెంబర్ 3: ఒడిశా పూరీ జగన్నాథుడి(Lord Jagannath)కి వేల కోట్ల ఆస్తులు, నగదు, బంగారం, విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. ఆలయం పేరిట ఉన్న బ్యాంకులోని డిపాజిట్లు, భూములపై ఎస్‌జీటీఏ (శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్) ప్రధాన పాలనాధికారి అరబింద కుమార్ పధీ గురువారం ప్రకటనలో వెల్లడించారు. జాతీయ బ్యాంకులో రూ.1,912 కోట్లు డిపాజిట్లు ఉండగా, ఫిక్స్‌డ్ డిపాజిట్లే రూ.1,811 కోట్లు, సేవింగ్, కరెంట్ అకౌంట్లలో రూ.100.71 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

డిపాజిట్ మొత్తంలో ఒడిశా ప్రభుత్వం రూ.500 కోట్ల కార్పస్ ఫండ్‌గా తెలిపారు. జగన్నాథుడి పేరిట మాన్యభూములు 60,821 ఎకరాలున్నట్లు తెలిపారు. 60,426 ఎకరాల భూమి ఒడిశాలోనే ఉందన్నారు. మిగతా 395 ఎకరాలు ఆరు రాష్ట్రాల్లో ఉందన్నారు. ఆలయ రత్నభాండాగారాల్లో బంగారం, విలువైన వజ్రాభరణాలు ఉన్నాయన్నారు. పూరీ జగన్నాథుడికి వచ్చే ఆదాయంలో భక్తులు ఇచ్చే కానుకలు, ఆలయం పేరిట ఉన్న క్వారీలు, గనుల నుంచి వచ్చే సొమ్ము, డిపాజిట్లపై వడ్డీ, ప్రభుత్వ గ్రాంట్లు, భూవిక్రయాలు భాగమని చెప్పారు.