4 September, 2026 | 11:09 AM

22ఏ నిషేధిత జాబితాను తొలగించాలి

04-09-2026 | 04:45am

ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, సెప్టెంబరు 3 (విజయ క్రాంతి): 22ఏ సెక్షన్ ప్రకారం కరీంనగర్ జిల్లాలోని రేకుర్తి, సీతారాంపూర్, కొత్తపెల్లి, చింతకుంటలో సుమారు 6000 ఎకరాలను నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలని మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు వారం రోజుల ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా గురువారం మూడవ రోజు రేకుర్తి చౌరస్తా వద్ద భూబాధితులు, రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కేవలం రాష్ట్రం సాధించడమే కాదు తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలవడం కోసమే బిఆర్‌ఎస్ పార్టీ ఉందన్నారు.

భారత రిజిస్ట్రేషన్ యాక్ట్ 22ఏ 1908 రూపొందించబడ్డదని, అయితే సుమారు 115 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేవలం దోచుకోవాలనే ఉద్దేశంతోనే పట్టా భూములను 22ఏ నిషేదిత జాబితాలో చేర్చారని అన్నాడు.

దీని ద్వారా పేద ప్రజలు వారి పిల్లల విద్య కోసం కానీ వివాహం కోసం కానీ భూములను అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు కాని పరిస్థితి నెలకొందని, ఈ దుస్థితికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని దుయ్యబట్టారు. వెంటనే నిషేధిత జాబితాల నుంచి తొలగించాలని ఇదే వేదిక లాగానే అసెంబ్లీలో కూడా ఈ విషయంపై ప్రభుత్వాన్నీ నిలదీస్తామని హెచ్చరించారు. ఇక రైతుల బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రైతు బీమా వేయాలని, రైతుబంధును అందించాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు,  స్థానిక డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవి- కృష్ణ గౌడ్, కరీంనగర్ రూరల్ కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షులు.. పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కాసారపు శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్లు గుగ్గిల జయశ్రీ, నలువాల పుష్పలత- రవీందర్ యూసుఫ్, జమ్ము, అలీ,గడ్డి ప్రదీప్, బావుపేట సర్పంచ్ పెంచాల ఆంజనేయులు, మాజీ కార్పొరేటర్లు గందె మాధవి, నాయకులు సౌకత్ అలీ,  సుంకిశాల సంపత్ రావు, సాబీర్ పాషా, గంగాధర చందు, మంద రాజమల్లు, తదితరులు పాల్గొన్నారు.