కేంద్రం నుంచి గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో భారత వ్యవసాయ ఉత్పత్తులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTA) వల్ల రైతులకు లభించే అవకాశాలపై కచ్చితమైన, సకాలంలో సమాచారం అందేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Union Minister Shivraj Singh Chouhan) తెలిపారు.
న్యూఢిల్లీలో జరిగిన రెండు రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత వ్యవసాయ ఉత్పత్తులకు కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో సున్నా దిగుమతి సుంకంతో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు.
అయితే అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను రైతులు పూర్తిగా వినియోగించుకోవాలంటే ఆయా దేశాల్లో ఏ వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవడం అవసరమని చౌహాన్ అన్నారు. అదే విధంగా విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసేటప్పుడు పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలపై కూడా రైతులకు అవగాహన ఉండాలని సూచించారు.
రైతులకు కేవలం ఉత్పత్తి పెంచడం మాత్రమే కాకుండా మార్కెట్ డిమాండ్, నాణ్యత ప్రమాణాలు, ఎగుమతి అవకాశాలపై సమాచారం అందించడం కూడా కీలకమని కేంద్రం చెబుతోంది. వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించేందుకు కేంద్రం పలు చర్యలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇటీవల వ్యవసాయ రంగంపై జరిగిన సమావేశాల్లోనూ రైతుల ఆదాయం పెంచడం, శాస్త్రీయ విధానాలతో సాగును ప్రోత్సహించడం, మార్కెట్ అవకాశాలను విస్తరించడం వంటి అంశాలపై కేంద్రం దృష్టి పెట్టింది.