ఎందుకు కొనసాగించడం లేదు?

29-09-2026 | 07:11pm

రామాయంపేట డివిజన్‌ను ఎందుకు కొనసాగించడం లేదు?

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఎందుకు కొనసాగించడం లేదు?

దసరా తర్వాత మలి విడత ఉద్యమం

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి

రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు కొనసాగించడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి(Former Deputy Speaker Padma Devender Reddy) ప్రశ్నించారు. మంగళవారం రామాయంపేటలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వ హయాంలో రామాయంపేట ప్రజల కోరిక మేరకు ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్‌ను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించకపోవడం పట్ల  అభ్యంతరం వ్యక్తం చేశారు.

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రామాయంపేట ప్రజల కోరిక మేరకు అప్పటి మంత్రి హరీష్ దృష్టికి డివిజన్‌ ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్లామని తెలిపారు. హరీశ్‌రావు ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. 2023 ఆగస్టులో మెదక్‌లో జరిగిన బహిరంగ సభలో రామాయంపేట రెవెన్యూ డివిజన్‌తో పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటును కేసీఆర్‌ ప్రకటించారని గుర్తుచేశారు.

కేసీఆర్‌ డివిజన్‌ ఏర్పాటును ప్రకటించిన వెంటనే అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను ప్రారంభించామని తెలిపారు. ఇన్‌చార్జి ఆర్డీఓను నియమించి ఆర్డీఓ కార్యాలయాన్ని కూడా ప్రారంభించామని చెప్పారు. అయితే మూడు నెలలకే ఇన్‌చార్జి ఆర్డీఓను తొలగించడంతో డివిజన్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు.

రామాయంపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు పరిపాలనా సేవలు అందుబాటులో ఉండేందుకు రెవెన్యూ డివిజన్‌ కొనసాగింపు అవసరమని అన్నారు. రెవెన్యూ, పరిపాలనా పనుల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా అవసరమైన సిబ్బందిని నియమించి ఆర్డీఓ కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ కొనసాగింపుపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

గతంలో ఏర్పాటు చేసిన డివిజన్‌ను కొనసాగించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని పరిపాలనా సౌలభ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ కొనసాగింపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి డివిజన్‌ను కొనసాగించేందుకు చర్యలు చేపట్టకపోతే దసరా తర్వాత మలి విడత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌,పీఏసీఎస్‌ చైర్మన్‌ బాదే చంద్రం,మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్టి విజయలక్ష్మి, నాయకులు సుప్రభాతరావు, ఉమామహేశ్వర్‌, శ్రీకాంత్‌ సాగర్‌, అస్నుద్దీన్‌, దోమకొండ శ్రీను, గణపురం కృష్ణగౌడ్‌, రొయ్యల నవీన్‌, మధ్యల రమేష్‌, కృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు