సేంద్రియ వ్యవసాయం నేల ఆరోగ్యానికి, రైతు ఆదాయానికి మేలు

29-09-2026 | 07:25pm
  1. నూనె గింజల పంటల సాగుతో అదనపు ఆదాయానికి అవకాశం 
  2. మండల వ్యవసాయశాఖ అధికారి ముంజ మహేష్

కన్నాయిగూడెం,సెప్టెంబర్ 29(విజయక్రాంతి): రైతులు సేంద్రియ వ్యవసాయ(Farmers organic farming) పద్ధతులను పాటించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పంటల నాణ్యతను పెంచుకోవచ్చని సహాయ సంచాలకులు విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారి వేమ తెలిపారు. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, జీవ ఎరువులు మరియు జీవ నియంత్రణ పద్ధతులను వినియోగించడం ద్వారా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని సమతుల్యం చేసుకోవచ్చని సూచించారు.

సేంద్రియ వ్యవసాయంలో నేలలో సేంద్రియ కర్బనం పెరగడం, నేలలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం మెరుగుపడటం, ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధి వంటి ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. పంటలలో సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు,

మరియు  రైతులు వరి ఆధారిత సాగుతో పాటు పంటల మార్పిడి విధానంలో నూనె గింజల పంటలను సాగు చేయాలని అధికారులు సూచించారు. వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి నూనె  గింజల పంటలకు దేశీయంగా మంచి ప్రాధాన్యత ఉందని తెలిపారు.

నూనె గింజల పంటలను పంటల మార్పిడిలో భాగంగా సాగు చేయడం ద్వారా నేల సారాన్ని మెరుగుపరచుకోవడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయని తెలిపారు. ముఖ్యంగా పప్పు మరియు నూనె గింజల పంటలను ప్రాంతంలోని నేలలు, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలని సూచించారు.

రైతులు నాణ్యమైన ధృవీకరించబడిన విత్తనాలను వినియోగించి, విత్తన శుద్ధి, సరైన విత్తే సమయం, సమతుల్య ఎరువుల వినియోగం, కలుపు యాజమాన్యం, తెగుళ్లు–పురుగుల సమగ్ర యాజమాన్యం వంటి పద్ధతులను పాటించాలని వృత్తి రీజినల్ హెడ్ వెంకటేశ్వర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ జిల్లా డైరెక్టర్ మధుకర్, వ్యవసాయ విస్తరణ అధికారి కళ్యాణి మరియు వృత్తి సంస్థ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు