నిర్లక్ష్యం ఎవరిది..?
గడువు ముగిసిన మందులను దగ్ధం చేసిన సిబ్బంది
గ్రామాన్ని చుట్టేసిన దట్టమైన పొగ
విపరీతమైన వాసనతో ఇబ్బందులు పడ్డ ప్రజలు
బెజ్జూర్ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): సామాజిక ఆరోగ్య కేంద్రంలో గడువు ముగిసిన మందులు(Expired Medicines) పెద్ద ఎత్తున దగ్ధం చేశారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో సోమవారం రాత్రి గడువు ముగిసిన మందులను దగ్ధం చేయడంతో గ్రామంలో విపరీతమైన పొగతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
మందుల నిల్వలు, వాటి గడు ముగిసే మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించక నిర్లక్ష్యం వహించడంతోటే పెద్ద ఎత్తున మందులు గడువు ముగిసి అగ్నికి ఆహుతి చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లిన రోగులకు ఇవ్వాల్సిన మోతాదులో మందులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. రక్తహీనతతో నిరుపేద గర్భిణీలు ఆసుపత్రికి వెళ్తే ఐరన్ సూప్రోచ్ ఇంజక్షన్లు కూడా ఇవ్వడం లేదని నిరుపేద గర్భిణీలు ఆరోపిస్తున్నారు.
ఆసుపత్రిలో సరిపడా వైద్య సిబ్బంది, వైద్యులు ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోటే మండల కేంద్రంలో సుఖప్రసవాల సంఖ్య భారీగా తగ్గినట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో సుఖప్రసవాల సంఖ్య సుమారుగా 50 కి ఉండగా , ప్రస్తుతం 10, 12 మాత్రమే సామాజిక ఆరోగ్య కేంద్రంలో సుఖప్రసవాలు జరుగుతున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి కేసును పరిశీలించకుండానే మాకెందుకులే అని రిఫర్ చేస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి.
కొంతమంది నిండు గర్భిణీలను ఆసుపత్రికి తీసుకువచ్చే మార్గమధ్యంలో, మరి కొంతమంది ఇంట్లోనే సుఖప్రసవాలు జరిగితే వాటిని కూడా ఆసుపత్రిలోనే సుఖప్రసవాలు జరిగినట్లు రికార్డులలో రాసుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా బెజ్జూర్ సామాజిక ఆసుపత్రి వైద్య సిబ్బంది తీరుపై జిల్లా వైద్య యంత్రాంగం, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి నిరుపేద రోగులకు వైద్య సేవలు అందించి, ఆరోగ్య కేంద్రంలోనే సుఖప్రసవాలు జరిగేలా చూడాలని, ప్రభుత్వం సక్రమంగా అందిస్తున్న విలువైన మందులను వృధా చేయకుండా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలా వైద్య సేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.