వనదుర్గమ్మ చెంత నిలువ నీడ కరవు..
- ఎండకు క్యూలైన్ లో అవస్థలు పడుతున్న భక్తులు
- చలువ పందిళ్లు లేక భక్తుల నానాపాట్లు
- రూ.కోట్లలో ఆదాయం, వసతులు శూన్యం
- పట్టించుకోని పాలకులు, అధికార యంత్రాంగం
పాపన్నపేట,సెప్టెంబర్29: దేశంలోనే రెండో వనదుర్గా మాత ఆలయం(Vanadurga Mata Temple).. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ ప్రాంతం.. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పుణ్యక్షేత్రం పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం. పొరుగు రాష్ట్రాల వారిని సైతం ఆకర్షిస్తున్న పర్యాటక కేంద్రం. నాడు ఉత్సవాలకే పరిమితమైన దేవస్థానం నేడు నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉండే పుణ్యక్షేత్రం. రూ.కోట్లలో సమకూరే ఆదాయం.
అలాగైతే ఇక్కడ అన్ని వసతులు బాగుంటాయని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే "పేరు గొప్ప ఊరు దిబ్బ" అన్న చందంగా తయారయింది ఏడుపాయల పరిస్థితి. రూ. కోట్లలో ఆదాయం ఉన్నా భక్తులకు వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. భక్తుల వసతులను పట్టించుకునే వారే కరవయ్యారు.
ఆదివారాలు ఇతర సెలవు రోజుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాలు ప్రధానంగా జంట నగరాల నుంచి పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం వేలాది భక్తులు ఏడుపాయల వనదుర్గామాత దర్శనానికి తరలివస్తారు. అమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయం చెంత నిలువ నీడ లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు.
ముఖ్యంగా ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులు కింద సీసీ, పైన ఎండ తీవ్రతకు పాదాలు బొబ్బలెక్కుతున్నాయని భక్తులు వాపోతున్నారు. భక్తులకు సకల వసతులు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకునే అధికార యంత్రాంగం నిలువ నీడ కల్పించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారు. కొద్దిపాటి ఆదాయం ఉన్న ఆలయాల్లో చలువ పందిల్లు ఏర్పాటు చేస్తుంటే రూ.కోట్లలో ఆదాయం ఉన్న ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో మాత్రం అధికారులు భక్తులకు నిలువ నీడ కల్పించలేకపోతున్నారు.
వర్షాకాలంలో సైతం భక్తులకు అవస్థలు తప్పడం లేదు. ప్రత్యేక దర్శనం, ధర్మ దర్శనంతో పాటు రాజగోపురం నుంచి అమ్మవారి ప్రధాన ఆలయం వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా లడ్డు, పులిహోర ప్రసాదం తింటూ కూర్చుందాం అన్నా ఎక్కడ నిలువ నీడ లేదు.
వనదుర్గమ్మ చెంత కొద్దిసేపు సేద తీరేందుకు అనువైన స్థలం లేకపోవడంతో భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి ప్రధాన ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయమై దేవస్థానం కార్యనిర్వాణాధికారి వీరేశంను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.