రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, డీఆర్డీఓ, పోలీస్, తూనికలు–కొలతలు, రవాణా శాఖల అధికారులు, రైస్‌మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై సన్నద్ధత సమావేశం నిర్వహించారు.
కొనుగోళ్లు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతులకు మద్దతు ధర అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రకాల వర్గీకరణకు అవసరమైన నమూనాలు, పర్యవేక్షకులను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం రవాణా వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, టెండర్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో 86,936 ఎకరాల్లో సన్నరకం, 13,645 ఎకరాల్లో ఇతర రకాల ధాన్యం సాగు కాగా, మొత్తం 1,05,400 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు కలెక్టర్ తెలిపారు. రైతుల ఫిర్యాదుల కోసం జిల్లా కంట్రోల్ రూమ్ 9390350142, రాష్ట్ర టోల్‌ఫ్రీ 1967, 180042500333 నంబర్లకు సంప్రదించవచ్చన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, వివిధ శాఖల అధికారులు, రైస్‌మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.