నైపుణ్యమే యువత బలం.. మోదీ కీలక సందేశం

21-11-2026 | 07:02pm

లక్నో: నైపుణ్యాభివృద్ధి రంగంలో ప్రతిభ కనబరిచిన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రోత్సాహం అందించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్వహించిన 5వ కౌశల్ దీక్షాంత్ సమారోహం(5th Kaushal Dikshant Samaroh)లో వివిధ నైపుణ్య శిక్షణ సంస్థలకు చెందిన 52 మంది జాతీయ స్థాయి టాపర్లను సత్కరించారు.

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ (Industrial Training Institutes), నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ (National Skill Convocation), ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (ఐటీఓటీలు)లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువతకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఐఐటీ, ఐటీఐలు రెండూ దేశానికి విలువైన ఆస్తులని పేర్కొన్నారు. ఐఐటీలో చదివినా, ఐటీఐలో శిక్షణ పొందినా దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతోనే వికసిత భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలో ప్రతి దేశం తన యువత నైపుణ్యాలను సమర్థంగా వినియోగించుకున్నప్పుడే అభివృద్ధి చెందుతుందని మోదీ అన్నారు. భారతదేశానికి చేతివృత్తులు, సంప్రదాయ కళలు గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయని గుర్తుచేశారు. లక్నో చికన్‌కారీ ఎంబ్రాయిడరీ, బనారస్ పట్టు, కాంచీపురం వస్త్రాలు, కాశ్మీర్ పష్మినా వంటి కళలు భారతీయ నైపుణ్య సంపదకు నిదర్శనమని వివరించారు.

యువత తమ శిక్షణ ద్వారా సంపాదించిన నైపుణ్యాలను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా, తమ నైపుణ్యాలతో ఉపాధి అవకాశాలను సృష్టించుకునే స్థాయికి ఎదగాలని సూచించారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌధరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా వృత్తి విద్య, నైపుణ్య శిక్షణకు జాతీయ స్థాయిలో ప్రోత్సాహం లభించింది.

మరిన్ని వార్తలు