ఏడు ఆరోగ్య ప్రాజెక్టులు దేశానికి అంకితం
పుదుచ్చేరి: వైద్య విద్య, ఆరోగ్య సేవలు, పరిశోధన రంగాల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా(Minister Jagat Prakash Nadda) పుదుచ్చేరిలోని జిప్మెర్లో ఏడు కీలక కార్యక్రమాలను దేశానికి అంకితం చేశారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ప్రాముఖ్యత కలిగిన జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (Jawaharlal Institute of Postgraduate Medical Education and Research)లో ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధన, విద్యార్థుల(Medical Students) సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
అనంతరం సంస్థ 15వ స్నాతకోత్సవంలో పాల్గొన్న నడ్డా.. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. స్నాతకోత్సవ ప్రసంగం చేస్తూ వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ సందర్భంగా 88 అవార్డు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పతకాలు, ఎండోమెంట్ బహుమతులను అందజేశారు. వైద్య విద్యార్థులు తమ జ్ఞానాన్ని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వినియోగించాలని పిలుపునిచ్చారు. జిప్మెర్లో ప్రారంభించిన ఏడు కార్యక్రమాలు వైద్య సేవల నాణ్యతను పెంచడంతో పాటు పరిశోధన, వైద్య విద్యాభివృద్ధికి దోహదపడనున్నాయి. ఈ కార్యక్రమంతో పుదుచ్చేరి వైద్య రంగానికి మరింత ప్రోత్సాహం లభించనుంది.